తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రభుత్వ సలహాదారు రమణాచారి సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రభుత్వ సలహాదారు రమణాచారి సంచలన వ్యాఖ్యలు

Ramanachari’s sensational comments : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై రమణాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారికి మాతృభాషపై ప్రేమలేదని వ్యాఖ్యానించారు. 1966లో అధికార భాషా సంఘం దుర్ముహుర్తంలో ఏర్పడినట్లుందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటైన గడియలు సరిగా లేనట్లుందని, పాలకులు.. ఎన్నికల వేళ తప్ప ఎప్పుడూ మాతృభాష గురించి పట్టించుకోవట్లేదని అన్నారు. ఎన్నికల వేళ తప్ప మాతృభాష గురించి మరెప్పుడూ పట్టించుకోవట్లేదని విమర్శించారు. మాతృభాషా దినోత్సవం అంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తనకు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు గతేడాది సన్మానం చేసి తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయాలని కోరారన్నారు. మాతృభాష అభివృద్ధి చేయలేకపోతే తనను మన్నించాలని ఆవేదన వ్యక్తం చేసిన రమణాచారి..ప్రభుత్వ సలహాదారు అడిగితేనే సలహాలు ఇస్తాడు కానీ అడగకపోతే ఇవ్వలేడంటూ వ్యాఖ్యానించారు.

అక్షరయాన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం హైదరాబాద్‌… టూరిజం ప్లాజాలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగపడే 14 పుస్తకాలను విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. అంతర్జాతీయ తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ముక్కలు చెక్కలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తానా, నాటా పేర్లతో అంతర్జాతీయ వేదికలపై తెలుగువారు విడిపోతున్నారన్న విద్యాసాగర్‌రావు.. మాతృభాషలో సామాజిక న్యాయం గురించి ప్రస్తావించారు. తెలుగు భాష పరిరక్షణకు అంతా ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు.