Telangana : తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలు ఏర్పాటు

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి సర్కార్‌ రెడీ అయ్యింది. ఇందుకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది.

Telangana : తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలు ఏర్పాటు

Telangana Government Gets Into Auction To Sell Of Lands For Funds

Telangana Govt Lands Sale : తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి సర్కార్‌ రెడీ అయ్యింది. ఇందుకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షులుగా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటైంది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్‌ కమిటీ, భూముల అనుమతుల కోసం అప్రూవల్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇక ల్యాండ్స్‌ అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. భూమి ధర నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమలు అమ్మకానికి మార్గదర్శకాలను సైతం సర్కార్‌ ఖరారు చేసింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా భూములు విక్రయం చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం.

వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూములు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ కమిటీలను ప్రభుత్వం నియమించింది.

భూములు కొనుగోలు చేసిన వారు ఎలాంటి నిర్మాణాలైన చేపట్టేందుకు వీలుగా ఆ భూములను మల్టీపర్పస్‌ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇతర భవన నిర్మాణ అనుమతులన్నీ నిబంధనల ప్రకారం సత్వరం మంజూరయ్యే విధంగా టీఎస్‌ బీపాస్‌ విధానం ద్వారా సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈ-వేలాన్ని నిర్వహిస్తారు.

భూముల కనీస ధరను నిర్ణయించడం, ఈ-వేలం షెడ్యూల్ ప్రకటన, మార్కెటింగ్, కన్సల్టెంట్ల సేవల వినియోగం, బిడ్ల ఆమోదం తదితరాలను నోడల్ ఏజెన్సీ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ-వేలం ద్వారా భూమిని పొందిన వారికి డబ్బులు చెల్లించిన ఏడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్ భూమిని రిజిస్టర్ చేసి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశ్రమల శాఖ తరపున ఉత్తర్వులు జారీ చేశారు.