Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ‌.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

Telangana Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ‌.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Lockdown

Telangana Lockdown : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు సంఖ్య 400 దాటడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కాగా, దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ ప్రతిపాదన ఏదీ లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

అయినప్పట్టికి సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఆగలేదు. తెలంగాణలో లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో, ఇదే విషయమై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరోమారు స్పష్టత ఇచ్చారు.

రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి ఆలోచనలు ఏవీ లేవని తేల్చి చెప్పారు. తెలంగాణలో లాక్ డౌన్ పుకార్లను నమ్మొద్దని కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కాగా, స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, స్కూళ్లు నడపడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇక గాంధీ ఆస్పత్రిని అవసరమైతే మళ్లీ కోవిడ్ సేవలకు వినియోగిస్తామన్నారు శ్రీనివాస్. నాన్ కోవిడ్ కేసులను క్లోజ్ చేస్తామన్నారు. గాంధీలో ఇప్పటికే కోవిడ్ రోగుల కోసం బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో, అలాగే తెలంగాణలో సెకండ్ వేవ్ మొదలైందన్నారు. జిల్లా ఆస్పత్రులు, పిహెచ్ సిలు సహా ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసామన్నారు. కోవిడ్ చికిత్సలకు అవసరమైన పరికరాలు, కిట్ లు, మాస్క్ లు వంటి వాటి అందుబాటుపై సమావేశం నిర్వహించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

తెలంగాణలో డేంజర్ బెల్స్..
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,867కి పెరిగింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 22,2021) రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు: మంత్రి ఈటల
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. ‘కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు’ అని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. వైద్యశాఖపై సోమవారం(మార్చి 22,2021) ఆయన సమీక్ష జరిపారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.