నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana Government Good News

Telangana Government Good News : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో తెలిపారు. 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని, దీంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల అవుతుందని మంత్రి చెప్పారు. ఇక ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే వారి రిటైర్మెంట్ వయస్సును పెంచామన్నారు. ఇది ఉద్యోగాల భర్తీకి ఏ మాత్రం అడ్డంకి కాదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.

గురువారం(మార్చి 25,2021) పలు బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఉద్యోగ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనీస పింఛను రూ.50వేలు, గరిష్ఠ పింఛను రూ.70వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.

‘‘మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశాం. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు. పీఆర్సీ కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. వయోపరిమితి పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తాం. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం’’ అని హరీశ్‌ రావు చెప్పారు.