ప్రైవేటు ఆసుపత్రులపై టి.సర్కార్ కొరడా : విరించి ఆసుపత్రిపై చర్యలు

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 11:34 AM IST
ప్రైవేటు ఆసుపత్రులపై టి.సర్కార్ కొరడా : విరించి ఆసుపత్రిపై చర్యలు

తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్‌ ఇచ్చింది. విరించి హాస్పిటల్‌లో కరోనా వైద్యం చేసే అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.



విరించి హాస్పిటల్‌పై కరోనా పేషెంట్ల నుంచి ఫిర్యాదులు ప్రభుత్వానికి వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్‌ పేషెంట్ల నుంచి రోజుకి 10 వేలకు మించి తీసుకోకూడదు. విరించి ఆస్పత్రి బిల్లుల్లో భారీగా తేడాలు ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఆ హాస్పిటల్‌లో కరోనా వైద్యం చేసే అనుమతులను రద్దు చేసింది.

కొత్తగా కోవిడ్‌ రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న రోగులకు యథావిథిగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చికిత్స కొనసాగించాలని ఆదేశించింది. ఆదేశాలు మీరి ప్రవర్తిస్తే అసలు ఆస్పత్రి పర్మిషన్‌నే రద్దు చేస్తామని హెచ్చరించింది.



కార్పొరేట్‌, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్‌ రోగుల విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. సంపాదించుకోవడానికి ఇది సమయం కాదన్నారు. ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేయడం సరికాదన్నారు. కరోనా పరిస్థితిని వ్యాపార కోణంలో చూడొద్దని చెప్పారు.



మానవత్వంతో సాటి మనిషికి సహాయం చేయాలన్నారు. చిన్న వైద్యానికే లక్షల రూపాయలు వసూలు చేయడం హీనమైన చర్యని మండిపడ్డారు. హితం అనే యాప్‌ ద్వారా విశ్రాంత వైద్యులు… వైద్య సలహాలు ఇస్తున్నట్టు ఈటల తెలిపారు. లక్షణాలు లేకుండా కేవలం అనుమానంతో పరీక్షలు చేయించుకోవద్దని ప్రజలకు సూచించారు.

తెలంగాణలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదన్నారు. రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్‌ పెట్టినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. దశలవారీగా అన్ని వైద్య కళాశాలల్లో కరోనా రోగులకు బెడ్లు కేటాయిస్తున్నామన్నారు.