Hyderabad Corona : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. 95శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు, బెడ్స్ దొరక్కపోవచ్చు

ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Hyderabad Corona : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. 95శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు, బెడ్స్ దొరక్కపోవచ్చు

394 Corona Cases Registered In A Single Day Across Telangana 1

Hyderabad Corona Warning : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గతంలో 85 శాతం మంది బాధితుల్లో లక్షణాలు లేకుండా ఉంటే.. ప్రస్తుతం 95 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. దీంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పకుండా పాటించాలన్నారు.

గతంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసిన తర్వాత రిపోర్టు రావడానికి చాలా సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని పీహెచ్‌సీల వరకు ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులో ఉన్నందున ఫలితం వెంటనే తెలిసిపోతుందని మంత్రి చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత బాధితులకు లక్షణాలు ఉంటే వెంటనే కరోనా కిట్‌ ఇచ్చి వారిని హోం ఐసోలేషన్‌కు తరలించడం.. లక్షణాలు ఉన్నట్లయితే ఆస్పత్రులకు పంపించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడంతో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సులభమవుతోందని మంత్రి ఈటల తెలిపారు.

తెలంగాణలో కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యశాఖ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఆయన మాట్లాడారు.

గత 20 రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని.. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యశాఖ అధికారులు సూచించారు. కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తలు పాటించకపోతే హాస్పిటల్స్‌లో బెడ్స్ కూడా దొరకకపోవచ్చని వైద్యాధికారులు హెచ్చరించారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కేంద్రం పలు రాష్ట్రాలను అలర్ట్‌ చేసిందని.. దేశంలో 50 శాతం కేసులు మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయని వివరించారు.