Telangana :తెలంగాణ సర్కార్ అలర్ట్ : రోహింగ్యాలు ఎక్కడున్నారు ? 

:దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్‌ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గి

Telangana :తెలంగాణ సర్కార్ అలర్ట్ : రోహింగ్యాలు ఎక్కడున్నారు ? 

Telangana :దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్‌ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది. మరి నిజంగానే రోహింగ్యాలు ఆ యాత్రకు వెళ్లారా..? ఒకవేళ వెళ్తే వాళ్లంతా ఇప్పుడెక్కడున్నారు..? కరోనా మహమ్మారి నుంచి యావత్‌ భారత్‌దేశం బయటపడుతున్న వేళ ఢిల్లీ తబ్లీగీ జమాత్‌ ఒక్కసారిగా కలకలం రేపింది.

జమాత్‌ ఘటనతో పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఆ కేసులు తగ్గుముఖం  పడకముందే…అదే తబ్లీగీ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జమాత్‌లో రోహింగ్యాలు కూడా హాజరయ్యారని..వారిని గుర్తించి పరీక్షలు చేయించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించండం మరోసారి ఆందోళన కల్గిస్తోంది. రోహింగ్యాలు కూడా ఢిల్లీ తబ్లిగీ జమాతేకు వెళ్లడంతో పాటు హర్యానాలో జరిగిన మేవాత్ ప్రార్థనలకు వెళ్లినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

రోహింగ్యా ముస్లింల కదలికలు, వారి వివరాలు సేకరించి వారందరికి స్క్రీనింగ్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. రోహింగ్యాలకు వైద్య పరీక్షలు చెయ్యడంలో ఆలస్యమైతే సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక కేంద్రం ఆదేశాలతో రోహింగ్యాల వివరాలు సేకరించే పనిలో పడింది తెలంగాణ పోలీస్ శాఖ. మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6 వేల 50 మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు పోలీస్‌శాఖ గుర్తించింది. ఇందులో అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెయ్యి మంది.. సైబరాబాద్‌లో 50 మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వారి వివరాలు సేకరించే పనిలో పడ్డ పోలీసులు…ఎవరెవరు ఢిల్లీ, హర్యానా ప్రార్థనలకు వెళ్లారు..వెళ్లిన వారు ఎక్కడున్నారు..అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జమాత్‌ యాత్రికులతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజాగా రోహింగ్యాల వ్యవహారం బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రార్థనలకు వెళ్ళిన రోహింగ్యాలు స్వచ్చందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.