మటన్ ధరలను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : April 30, 2020 / 06:10 AM IST
మటన్ ధరలను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో మాంసం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాంసం ధరలకు కరోనా కాలంలో కూడా రెక్కలు వచ్చాయి.  అయితే ఈ విషయంలో అటువంటి వాళ్లపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి మాంసం ధరలను ఫిక్స్ చేసింది. కిలో మటన్ ధర రూ.700కే అమ్మాలని నిర్ణయం తీసుకుంది. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మేరకు పశు సంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. దుకాణాల ముందు ధర తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. మాంసం ధరలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మంత్రి తలసాని ఆదేశాల మేరకు మాంసం ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

సదరు కమిటీ దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, బజార్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు 11 మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. లైసెన్స్‌ లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐదు దుకాణాలను మూసివేశారు. అలాగే సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సదరు మాంసం అమ్మకం దారులకు ఆదేశాలు జారీచేశారు.