తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

  • Published By: naveen ,Published On : July 1, 2020 / 11:22 AM IST
తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమే ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేబినెట్ భేటీ తర్వాత అధికారిక ప్రకటన రానుంది.

రాష్ట్రంలో 16వేలు దాటిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం(జూన్ 30,2020) ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 945 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 8785. గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కు చేరింది. ఇక మంగళవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాతో చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.

24 గంటల్లో 869 కేసులు:
మంగళవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు రికార్డ్ అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 869 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 29 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 21 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 13 కేసులు నమోదయ్యాయి.

GHMCలో 800కుపైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది 4వ సారి:
కొన్ని రోజులుగా గ్రేటర్ పరిధిలో నమోదవుతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 12వేల 863 కేసులు నమోదయ్యాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 800కుపైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది 4వ సారి. దీంతో మహా నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కరోనాను కట్టడి చేయాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి అత్యంత కఠినంగా లాక్ డౌన్ విధించాలనే యోచనలో ఉంది.

lock down in hyderabad

అమల్లోకి అన్ లాక్ 2:
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అన్ లాక్ విధానం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అన్ లాక్ 1.0 జూన్ 30వ తేదీతో పూర్తయింది. జూలై 1 నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనలు జూలై నెలాఖరు వరకు కొనసాగించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.

అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి:
మరోవైపు లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జూలై 31 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అమలులో ఉంటుంది. అంటే రాత్రి ఒక గంట పెంచారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్‌, మెట్రో రైల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్‌, ఆడిటోరియంలకు జూలై 31 వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Read:హైదరాబాద్‌లో లాక్‌డౌన్, నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం