Medical Shops : డాక్టర్ చీటీ ఉంటేనే మందులు, మెడికల్ షాపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను మరోసారి అమలు చేయాలని ఆదేశించింది.

Medical Shops : డాక్టర్ చీటీ ఉంటేనే మందులు, మెడికల్ షాపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

Medical Shops

Telangana Medical Shops : తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను మరోసారి అమలు చేయాలని ఆదేశించింది. దగ్గు, జ్వరం లక్షణాలతో ఉన్నవారికి డాక్టర్ చీటీ లేకుండా మందులు(మెడిసిన్) ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అలాగే అన్ని మెడికల్ షాపుల్లోనూ ‘నో మాస్క్-నో మెడిసిన్’ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించింది.

కరోనా టెస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం:
రాష్ట్రంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో కోవిడ్ టెస్ట్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది.

సర్జరీలు అవసరం ఉన్న వాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని.. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారిలో లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సిందేనని ఆదేశించింది వైద్యశాఖ. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 45 ఏళ్లుపైబడిన వాళ్లకు కూడా వాక్సినేషన్‌ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది 45 ఏళ్లు పైబడివారు ఉన్నట్టు గుర్తించారు. 1000 ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో ఇప్పటి వరకు వాక్సినేషన్ సౌకర్యం ఉందని.. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్ ని వేగవంతం, విస్తృతం చేస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఫోకస్:
మరోవైపు ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవించకుండా చూడాలని డాక్టర్లతో చెప్పింది. అన్ని ఆసుపత్రుల్లో PPE కిట్స్, రిమెడ్‌సెవర్ ఇంజెక్షన్లు, N 95 మాస్క్‌లు, లిక్విడ్ ఆక్సిజన్ టాంక్‌లు, బల్క్ సిలెండర్‌లు, టాబ్లెట్స్, డాక్టర్లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. అదనపు సిబ్బంది అవసరం అయితే ఎంతమందినైనా తాత్కాలిక పద్దతిలో తీసుకోవాలని చెప్పింది.

తెలంగాణలో కరోనా విలయతాండవం:
తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 337 మంది కోలుకోగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల 551 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,166 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో 684 కేసులు నమోదు కాగా.. గురువారం నాటి బులెటిన్‌లో ఆ సంఖ్య 887కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.