Salaries Revised : నెలకు రూ.39వేల 837 జీతం.. వారి వేతనాలు సవరించిన ప్రభుత్వం

రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది.

Salaries Revised : నెలకు రూ.39వేల 837 జీతం.. వారి వేతనాలు సవరించిన ప్రభుత్వం

Salaries Revised

Salaries Revised : రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. కేటగిరీల వారీగా కనీస మూల వేతనాలను నిర్ణయిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కిల్డ్‌ కేటగిరీ-1 కింద కనీస వేతనం రూ.39,837, కేటగిరీ-2కు రూ.35,254, కేటగిరీ-3కి రూ.31,199, కేటగిరీ-4 కింద రూ.27,610గా ఖరారు చేసింది.

ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ సిబ్బందిని ఈ కేటగిరీల్లోకి చేర్చారు. ఆయుధాలు లేకుండా ఉన్నవారిని స్కిల్డ్‌ కేటగిరీలో పేర్కొంటూ రూ.24,434గా సూచించింది. అలాగే.. సెమీస్కిల్డ్‌ కేటగిరీ వారికి రూ.21,623, అన్‌స్కిల్డ్‌ కేటగిరీ వారికి రూ.18,019గా ఖరారు చేసింది. ఆయా ఉద్యోగులకు డీఏ పాయింట్‌ పెరిగిన కొద్దీ చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కేటగిరీల వారీగా రూ.12 నుంచి రూ.26.54గా సూచించింది.

ఉద్యోగులకు యాజమాన్య సంస్థలు పనిచేసే చోట ఆహారాన్ని అందిస్తే నెలకు రూ.540 వేతనం నుంచి మినహాయించవచ్చని, సెలవు రోజుల్లో పనిచేసే వారికి రెండింతల వేతనం ఇవ్వాలని స్పష్టం చేసింది. మహిళా, పురుష ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాలు చూపొద్దని, ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసిన కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం పొందితే.. అధిక వేతనాన్నే కొనసాగించాలని తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే ఉద్యోగులకు రాత్రి వేళ (నైట్‌ షిఫ్ట్‌) విధుల కింద 25 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.