Kokapet Khanamet Lands Auction : భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.

Kokapet Khanamet Lands Auction : భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Kokapet Khanamet Lands Auction

Kokapet Khanamet Lands Auction : కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రేపటి(జూలై 15,2021) భూముల విక్రయానికి అడ్డంకులు తొలిగాయి. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే వేలం ప్రక్రియ ఆపాలని కోరుతూ బీజేపీ నేత విజయశాంతి హైకోర్టులో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

కోకాపేట.. కాసుల పంట
కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. 49.92 ఎకరాలను ఈ నెల 15న ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం వేయబోతోంది. ఇప్పటికే వేలం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ భూములను కొనుగోలు చేయడానికి భారీ డిమాండ్‌ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఎకరా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా సర్కారుకు రూ.2వేల 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్‌ నిర్మాణాన్ని కూడా అధికారులు మొదలుపెట్టారు.