దిశ నిందితుల శవాలకు రెండ్రోజుల్లో రీ పోస్టుమార్టం

దిశ నిందితుల శవాలకు రెండ్రోజుల్లో రీ పోస్టుమార్టం

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ చేపట్టి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఇందులో ఓ మార్పు చేసింది. రీ పోస్టు‌మార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించాలని అందులో పేర్కొంది. సోమవారం(డిసెంబర్ 23,2019) సాయంత్రం 5 గంటల్లోగా రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి నివేదికను కోర్టుకు అందించాలని ఆదేశించింది.

తెలంగాణ వైద్యులపై నమ్మకం లేదంటూ రీ పోస్టుమార్టం దాఖలు చేసిన పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫలితంగా ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించింది కోర్టు. పోస్టుమార్టం తర్వాత పోలీసుల సమక్షంలోనే నిందితుల కుటుంబాలకు మృతదేహాల్ని అప్పగించాలని అందులో పేర్కొంది. రీ పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది. 

దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయాయి. దిశపై అత్యాచారం కేసు విచారణలో ఉండగానే డిసెంబర్ 6న చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు చనిపోయారు. ఘటన జరిగి 16 రోజులు అవుతున్నా.. నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు మాత్రం జరగలేదు. ఎన్‌కౌంటర్ పై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరుగుతుండటంతో మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.

శనివారం(డిసెంబర్ 21,2019) మృతదేహాల భద్రత అంశంలో కోర్టు విచారణకు హాజరయ్యారు గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ శ్రావణ్. ఈ సందర్భంగా మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని కోర్టుకు తెలిపారు. ఇలాగే కొనసాగితే మరో వారంలో పూర్తిగా కుళ్లిపోతాయని వెల్లడించారు.