లాయర్ దంపతుల హత్య.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు

లాయర్ దంపతుల హత్య.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు

highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని చెప్పింది. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ కేసులో తప్పనిసరిగా అన్ని ఆధారాలు సేకరించాలని హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

న్యాయవాదుల హత్య తమ దృష్టిలో ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందన్న ధర్మాసనం.. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది.

న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈరోజు విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరిస్తున్నట్టు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని వాపోయారు. వామన్‌రావు దంపతుల హత్యకేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దోషులకు ఉరిశిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని లాయర్లు డిమాండ్‌ చేశారు.

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం(ఫిబ్రవరి 17,2021) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కారులో వెళ్తున్న లాయర్ దంపతులను అటకాయించి కత్తులతో దాడి చేశారు. లాయర్ ను కారులోంచి రోడ్డుపైకి లాగి అతి కిరాతకంగా చంపేశారు.

మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు. బుధవారం(ఫిబ్రవరి 17,2021) ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్‌ సతీశ్‌తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50కి తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు.

మంథని నుంచి గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి కారులో వీరి వాహనాన్ని వెంబడించారు. కల్వచర్ల సమీపంలో లాయర్‌ కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డగించారు. కొబ్బరి బొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్‌రావును కిందకు లాగారు. మెడ, పొట్ట భాగంలో నరికారు. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణి మెడపైనా నరికారు. అప్పటికే రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథని వైపు పరారయ్యారు. అక్కడున్న వారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్సులో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్ర గాయాలు కావడం, రక్తస్రావం జరడంతో దంపతులు మృతి చెందారు.

ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలపై తరచూ స్పందించడం, వివాదాస్పదంగా మారిన తగాదాలను వృత్తిపరంగా వామన్‌రావు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారే దంపతులను హతమార్చినట్లు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని వారు హైకోర్టుకు విన్నవించుకోగా రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ విషయమై ఈ దంపతులు పలుమార్లు రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.

పెద్దపల్లి-మంథని మార్గంలో రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్‌ పంపు దగ్గర రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. దుండగులు అక్కడ లాయర్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారు. కత్తిపోట్ల తర్వాత రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. నిందితులు దాడి అనంతరం వచ్చిన కారులోనే మంథని వైపు వెళ్లారు. అదే కారులో అంతకుముందు మంథనిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్యకు పాల్పడింది శ్రీనివాసేనని, గుంజపడుగుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌, అతడి అనుచరులు అక్కపాక కుమార్‌, వసంతరావు ప్రోద్బలంతో ఈ హత్యలకు పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దారుణ హత్య వెనుక టీఆర్ఎస్ కు సంబంధించిన కొందరు నాయకుల హస్తం ఉందని మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు, పోలీసులే కారణమని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను పోలీసులు గాలికి వదిలేయడం అనుమానాస్పదంగా ఉందని… దీనికి రామగుండం సీపీ సత్యనారాయణ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే అన్నారు.

లాయర్‌ వామన్‌రావు, నాగమణి దంపతులు పోలీసులు, అధికారులు, వారి చర్యలను సవాలు చేస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలు చేయడంతోపాటు పలువురు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించేవారు. అధికారులకు ముఖ్యంగా పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న కేసుల్లో వాదనలు వినిపించడానికి చాలామంది వీరిని న్యాయవాదులుగా నియమించుకునేవారు. 2020 మే 22న మంథని పీఎస్ లో శీలం రంగయ్య అనుమానాస్పద మృతిపై నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌తో కోర్టు విచారణ జరిపించింది. ఆ నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేస్తానని చెప్పారు.

పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన ఆమె రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్‌ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు. వారికి భయపడి వాంగ్మూలం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ గత డిసెంబరులో పిటిషన్‌ వేశారు. వామన్‌రావు దంపతులను పోలీసు స్టేషన్లకు పిలవొద్దని హైకోర్టు అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆ ఉత్తర్వులను తొలగించాలన్న ఏజీ అభ్యర్థనను కూడా తిరస్కరించింది. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న తమను పిలిచి వేధిస్తున్నారని నాగమణి కోర్టుకు నివేదించడంతో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది.

గతంలో టీఆర్ఎస్ నేత పుట్ట మధు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌లోనూ లాయర్‌ దంపతులు కీలక పాత్ర పోషించారని తెలిసింది. మధు సతీమణి శైలజ స్థానిక ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ దాఖలైన పిటిషన్లు, బాచుపల్లి సీఐ, ఎస్సైలపై దాఖలైన మరో పిటిషన్‌లోనూ న్యాయవాదిగా వాదనలు వినిపించారు. అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంతంలో వెంకటాపురంలో ఇసుక క్వారీయింగ్‌కు అనుమతిపై నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. తక్కువ ధరకే కేటాయించారని, దీనివల్ల పంచాయతీకి రూ.49 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వీటితోపాటు భూసేకరణను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లలో వీరు న్యాయవాదులుగా ఉన్నారు.