Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్.. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు?

Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్.. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

Mahmood Ali On Telangana Lockdown

Mahmood Ali On Telangana Lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సెకండ్ వేవ్ లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల‌తో జనం భయాందోళన చెందుతున్నారు. అప్రమ‌త్తమైన తెలంగాణ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే నైట్ క‌ర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయినా కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో చివరి అస్త్రంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ ఆధ్వర్యంలో బుధవారం(ఏప్రిల్ 28,2021) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. హోమ్ శాఖ కార్యదర్శి, డీజీపీ స‌హా క‌మిష‌న‌ర్లు ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు. ‘‘రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించాం. లాక్ డౌన్‌ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకుంటారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత లాక్‌ డౌన్‌పై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. లాక్‌ డౌన్‌ పెట్టడం సీఎంకు ఇష్టం లేదు. ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయి’ అని హోంమంత్రి అన్నారు.

కాగా, ఏప్రిల్ 30 త‌ర్వాత లాక్‌డౌన్ పెట్టే యోచ‌న‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక స‌మ‌ర్పించ‌గా.. ప్రతిపాద‌న‌లు హోంశాఖ‌కు చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు, కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంపై హైకోర్టు సీరియస్ గా ఉంది. కరోనాను కట్టడికి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించగా, ఈ నెల 30తో ముగియ‌నుంది. ఆ త‌ర్వాత లాక్‌డౌన్‌కే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పినా ప్రభుత్వం కనీసం సమీక్షా సమావేశాలు జరపడం లేదని మండిపడుతున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం గురువారం(ఏప్రిల్ 29,2021) రానుంది. అనంతరం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.