Telangana Inter Exams : పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన లేదు, ఆ 2 ఎగ్జామ్స్ ఇంట్లోనే.. ఇంటర్ బోర్డు క్లారిటీ

Telangana Inter Exams : పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన లేదు, ఆ 2 ఎగ్జామ్స్ ఇంట్లోనే.. ఇంటర్ బోర్డు క్లారిటీ

Telangana Inter Exams

Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొంది. దీనిపై ఇంటర్ బోర్డు ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయని, రద్దు చేసే అవకాశం లేదని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ స్పష్టంచేశారు. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్‌చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం మే 1 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో హాల్‌ టికెట్లను జారీచేస్తామని ఆయన వివరించారు.

అయితే ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో జరగాల్సిన ఇంటర్నల్‌ పరీక్షలను కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే రాసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అసైన్మెంట్ల రూపంలో ఇస్తామని, ఇంటివద్దే సమాధాలు రాసి, వారం పదిరోజుల్లో కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థులకు వారం పది రోజుల సమయం ఇస్తామన్నారు. అనంతం ఆ అసైన్మెంట్లను సమర్పించాలన్నారు.

ఇక ప్రాక్టికల్ పరీక్షలపై సైతం జలీల్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్‌ 7నుంచి 20 వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరీక్షల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించామని, మూడు ప్రత్యామ్నాయాలను ఆయా ప్రణాళికలో ప్రతిపాదించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అయితే అవి వాయిదా పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. వివిధ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తో పాటు ఎంసెట్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.