నారాయణ, చైతన్య కాలేజీలకు రోజుకు రూ.లక్ష జరిమానా

  • Published By: vamsi ,Published On : October 30, 2019 / 01:17 PM IST
నారాయణ, చైతన్య కాలేజీలకు రోజుకు రూ.లక్ష జరిమానా

కాలేజీలపై కొరడా ఝళిపించింది ఇంటర్‌ బోర్డు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన కారణంగా ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున కట్టాలంటూ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది ఇంటర్ బోర్డు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లుగా గుర్తించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకుని నోటీసులు ఇచ్చారు.

నిబంధనలు పట్టించుకోకుండా తరగతులు నిర్వహించిన కాలేజీల్లో 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే అని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన బోర్డు నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీనిపై చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. అయితే ఇంటర్ బోర్డు వారిని పట్టించుకోలేదు. జరిమానా కట్టాలని ఆదేశించింది.

మరోవైపు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేయడం, వారికి కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక వ్యక్తిని నియమించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 404 జూనియర్‌ కాలేజీలు ఉండగా.. ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో లెక్చరర్‌ను ఎంపిక చేసి సైకాలజీ నిపుణులతో శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.