తెలంగాణ ఇంటర్ మీడియట్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ ఇంటర్ మీడియట్ పరీక్షల షెడ్యూల్

Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక..ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరగనుంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తించనుంది.

మొదట ఇంటర్‌ పరీక్షలను మే 3 నుంచి ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని, 19వ తేదీకి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ముగించాలని ఇంటర్‌బోర్డు షెడ్యూల్‌ రూపొందించింది. సాధారణంగా ఇంటర్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన తర్వాత టెన్త్‌ పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంటుంది. ఈసారి అందుకు భిన్నంగా ముందే టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. 9, 10 తరగతుల విద్యా క్యాలెండర్‌ విడుదల సమయంలోనే మే 17 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

దాంతో ఇంటర్‌ ప్రధాన పరీక్షలు పూర్తికాకుండా పది పరీక్షలు ప్రారంభమైతే పరీక్షా కేంద్రాలు, ఆరోగ్య, పోలీసు సిబ్బంది సర్దుబాటు సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇంటర్‌బోర్డు మూడు రకాల షెడ్యూల్లను తయారు చేసి పంపడంతో ప్రధాన సబ్జెక్టులను మే 13వ తేదీతో పూర్తయ్యే షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మే 14వ తేదీ రంజాన్‌ ఉన్నందున ఆ లోపు ముఖ్యమైన సబ్జెక్టులు పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించారు.