త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్….అప్పటిదాకా ప్లాస్మాయే మందు

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 04:40 PM IST
త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్….అప్పటిదాకా ప్లాస్మాయే మందు

కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నారు. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తు చేసిందని చెప్పారు. కరోనా విస్తరిస్తున్న వేళ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.

ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసిన పోలీసుల్ని మంత్రి ఈటెల అభినందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వైద్యులు ఎంతో సాహసంతో కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ దేవుళ్ళ స్థానంలో నిలిచారన్నారని తెలిపారు. కరోనా వల్ల కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్తితుల్లో వైద్య సిబ్బంది రోగులకు తోడుగా ఉండటం అభినందనీయమన్నారు.

ప్లాస్మా దానం కరోనా రోగులకు ఎంతో మనో ధైర్యాన్ని ఇస్తోందన్నారు. పలు ఔషధాల మాదిరిగానే ప్లాస్మా చికిత్స కూడా రోగులకు ఉపయోగపడుతోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని రకాలుగా తోడుగా ఉండటం అభినందనీయమన్నారు. పోలీసులు సామజిక బాధ్యతతో పాటుగా ప్లాస్మా దానం చేయడానికి చొరవ తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు .. కరోనాకు భయపడి, ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదన్నారు.

కేన్సర్, మూత్రపిండాలు, ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు దానికి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. లేకపోతే ఆయా వ్యాధులతో మృతి చెందే ప్రమాదం ఉందన్నారు. ఉస్మానియాతో పాటు ఇతర ప్రభుత్వ ఆపత్రుల్లోనూ అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నాయన్నారు. వీలైనంత తొందరలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

కరోనా కంటే తీవ్రమైన రోగాలు మనిషిని ఏమీ చేయలేకపోయాయన్నారు. కేవలం 2 శాతం మంది మాత్రమే కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దైర్యంగా ఉండి కరోనాను ఎదుర్కొనేలా అందరూ కృషి చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.