ప్రజాసేవ కోసం లక్షలు వచ్చే ఉద్యోగం వదులుకున్నారు

కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారు కొందరు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 10:13 AM IST
ప్రజాసేవ కోసం లక్షలు వచ్చే ఉద్యోగం వదులుకున్నారు

కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారు కొందరు.

కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారు కొందరు. ఇక ప్రొఫెసర్లుగా, లెక్చరర్‌గా, టీచర్లుగా పని చేస్తున్న వారూ ఉన్నారు. అలాగే విదేశాల్లో ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నవారు. లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారు. అయితే ప్రజా సేవ కోసం లక్షల రూపాయల వచ్చే జీతం, ఉద్యోగం వదులుకున్నారు. ఉద్యోగాలను కాదని ఎన్నికల బరిలోకి దిగారు.  

సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ..
పట్టణంలోని 33 వార్డుకు చెందిన నట్టు జాహ్నవి మున్సిపల్‌ బరిలోకి దిగారు. వయసు 25 ఏళ్లు. ప్రసుత్తం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ప్రజలతో ఉంటే తనకు ఇంకా అనుభవం వస్తుందని, ప్రజా సేవ అంటే ఇష్టం అని ఆమె చెబుతున్నారు. తండ్రి వేణుగోపాల్‌ ప్రోత్సాహంతో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఎంఏ బీఈడీ చేసి, ఎల్‌ఎల్‌బీ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తూ చైర్‌పర్సన్‌ రేస్‌లోనూ ఉన్నారు. తన ఉన్నత చదువులు, పరిజ్ఞానం సాయంతో అభివృద్ధి చేస్తానని జాహ్నవి తెలిపారు.

 

contest

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కాదని..
కామారెడ్డి పట్టణంలోని 34వ వార్డు బీజేపీ అభ్యర్థిని ఆకుల సుజిత ఎంటెక్‌ చదివారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా జాబ్ చేస్తున్నారు. జీతం భారీగానే అందుకుంటున్నారు. అయితే కామారెడ్డిలో తమ వార్డును అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు ఇండియాకు వచ్చారు. అమెరికాలో ఉద్యోగం వదులుకున్నారు. తన భర్త ఇక్కడే బిజినెస్‌ చేస్తుండడంతో ఇద్దరు కలిసి వార్డు అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ వార్డులో ప్రధానంగా ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని సుజిత వాపోయారు. తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదన్నారు. బోర్ల నుంచి నీటిని సరఫరా చేయకపోవడంతో చలించిపోయానని.. వార్డులో ప్రజా ప్రతినిధిగా ఉంటేనే సమస్యలను పరిష్కారం చేయవచ్చని ఉద్దేశ్యంతో పోటీ చేస్తున్నానని తెలిపారు

elections

MBA చదివి..
పట్టణంలోని 27వ వార్డుకు చెందిన ముదాం ఎంబీఏ చదివారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివారు. మొదటి నుంచి చదువుల్లో టాపర్‌గా నిలిచారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 27వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ రావడంతో కాలనీవాసుల ప్రోత్సాహంతో ఎన్నికల బరిలో నిలిచారు.

టీచర్ ట్రైనర్..
పట్టణంలోని 32 వార్డుకు చెందిన కమటాల సరోజ ఉన్నత చదువులు చదివి ఈసారి పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎంఏ, బీఈడీ చదివారు. భర్త ప్రముఖ పిల్లల డాక్టర్. ఇన్‌ఫాంట్‌ ఎడ్యూకేటర్‌గా గర్భిణులకు, మహిళలకు 20 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నారు. టీచర్ అభ్యర్థులకు ట్రైనర్ గా పని చేస్తున్నారు. అలాగే సన్నిహిత మహిళా సొసైటీని ఏర్పాటు చేసి స్వయం ఉత్పత్తితో జ్యూట్‌ బ్యాగ్స్‌ తయారు చేస్తూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్నారు.

ennikalu

ఎంటెక్ చదివి..
పాత పట్టణంలోని 26వ వార్డుకు చెందిన పిప్పిరి శ్రావణి బీటెక్, ఎంటెక్‌ ఉన్నత చదువులు చదివారు. తొలిసారిగా పోటీలోకి దిగారు. కామారెడ్డిలోని అరోరా ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. హైటెక్‌ సిటీలో ఉద్యోగం కూడా చేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేద్దామని మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన వారు.. విద్యావంతులు.. ఉద్యోగులు.. ప్రజా సేవలో ముందుంటామని రావడం, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం అంటున్నారు స్థానికులు.