ఏ క్షణానైనా సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 10:00 AM IST
ఏ క్షణానైనా సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీస్థాయిలో వస్తోంది.



దీంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే కు ఉన్న 12 గేట్లకు గాను..10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి.. 2.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బిరా బిరా అంటూ…కృష్ణమ్మ నాగార్జున సాగర్ లోకి వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు నాగార్జున సాగర్ లోకి 1.69 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో నిండుకుండలా మారిపోతోంది.

నీటి నిల్వ 271.38 టీఎంసీలకు చేరింది. మరో 41 టీఎంసీల నీరు చేరితే సాగర్ మొత్తం నిండిపోనుంది. దీంతో సాగర్ గేట్లను ఎత్తివేయాలని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సాగర్ గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.



ఈ క్రమంలో..నాగార్జున సాగర్ ను చూడటానికి ఎవరూ రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.