ఇళ్లకు తాగునీటి స‌ర‌ఫ‌రాలో తెలంగాణ నెంబర్ వన్

  • Edited By: madhu , November 5, 2020 / 01:56 PM IST
ఇళ్లకు తాగునీటి స‌ర‌ఫ‌రాలో తెలంగాణ నెంబర్ వన్

Telangana Number One State : తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు తాగునీరు లేక తల్లాడింది. కానీ స్వరాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందిస్తోన్న రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 99 శాతం ఆవాసాలకు తాగునీరు అందిస్తోన్న స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను అందుకుంది. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన స్కీమ్స్‌ దేశానికే ఆదర్శంగా నిలిచాయి.అలాంటిదే మిషన్ భగీరథ. ఇంటింటికీ మంచినీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. మిషన్‌ భగీరథతో తరతరాలుగా నల్లగొండ జిల్లాను పీడిస్తోన్న ఫ్లోరైడ్ భూతం వదిలిపోయింది. గడపగడపకూ నల్లానీరు అందుతుంది.ఆగస్టు 7.. 2016 లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మిషన్‌ భగీరథ పథకం… దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం స్ఫూర్తితో కేంద్రం దేశవ్యాప్తంగా జల్‌ జీవన్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్‌లో రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడంతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను తెలంగాణను అభినందించారు.తెలంగాణ‌లో మొత్తం 54 ల‌క్షల 38 వేల ఇండ్లు ఉండ‌గా.. ప్రస్తుతం 54 ల‌క్షల 37 వేల 812 ఇండ్లకు భ‌గీర‌థ ద్వారా మంచినీరు అందుతుంది. తెలంగాణ‌లో 99 శాతం గృహాల‌కు జ‌ల్ జీవ‌న్ మిష‌న్ లో భాగంగా భ‌గీర‌థ నీళ్లు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో తెలంగాణతో ఏ రాష్ట్రం పోటీ ప‌డ‌లేకపోయింది. రెండో స్థానంలో పాండిచ్చేరి ఉంది. పాండిచ్చేరిలో లక్షా 15 వేల గృహాలుండగా .. లక్ష గృహాలకు తాగునీరు అందుతుంది.మిష‌న్ భ‌గీర‌థ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఇప్పటి వరకు 33 వేల 400 కోట్లను ఖ‌ర్చు చేశామన్నారు. 80 శాతం నిధులు నాబార్డ్ ద్వారా రుణం తీసుకున్నామన్నారు. ఈ పథకంపై కేంద్రం ప్రశంసలు కురిపించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పట్టణాలు, గ్రామాలకే కాదు.. మారుమూల తాండాలకు కూడా నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. శరవేగంగా వాటర్ ట్యాంకులను నిర్మిస్తోంది.