Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్...

Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

Trs Paddy

Telangana Paddy Issue : ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ పోరు ఉధృతం చేస్తోంది. ఢిల్లీ వేదికగానే కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్ధమైంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించిన అధికార పార్టీ.. ఇప్పుడు హస్తినలోనే మకాం వేసింది. ధాన్యం సేకరణలో దేశం మొత్తం ఒకే పాలసీ ఉండాలని డిమాండ్ చేయడంతో పాటు.. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ.. దేశ రాజధానిలో నేడు దీక్షకు దిగనుంది టీఆర్‌ఎస్‌. ఢిల్లీ వేదిక నుంచి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి అల్టిమేటం జారీ చేయనున్నారు.

Read More : TRS Delhi Dharna : మా దీక్షను చిన్న చూపు చూస్తే కేంద్రానికే నష్టం-నిరంజన్ రెడ్డి

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా దీక్ష చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్సీ కవిత, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్ వినోద్ కుమార్. సభా వేదిక, ఇతర ఏర్పాట్ల విషయాలపై పలు సూచనలు చేశారు. కనీవిని ఎరుగని రీతిలో ప్రజా ప్రతినిధులతో నిరసన చేపడుతున్నామన్నారు వినోద్‌కుమార్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ తదితరులు దీక్షా వేదిక ఏర్పాటు పనులను ఇప్పటికే పరిశీలించారు. దీక్షలో పాల్గొనేవారికి ఏ ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు నేతలు.

Read More : TRS Protests: ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

దేశవ్యాప్తంగా ఒకే రకమైన పంట సేకరణ విధానం ఉండాలనేదే తమ డిమాండ్ అంటున్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలంతా పాల్గొంటారని స్పష్టం చేశారు. మూడు వేల మందికి పైగా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. దీక్షలో పాల్గొనేవారికి ఏ ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు నేతలు. వేదిక, పార్కింగ్‌, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షా స్థలికి చేరుకొనేందుకు వాహనాల ఏర్పాటుతో పాటు తదితర పనులకు ఉప కమిటీలు నియమించారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు నిర్వాహకులు.

Read More : Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ రాగానే మంత్రిమండలి సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పడం దారుణం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఉప్పుడు బియ్యం ఇవ్వొద్దని తమ మెడపై కత్తి పెట్టి కేంద్రం రాయించుకుందని ఆరోపించారు. కేంద్రానికి చెప్పాల్సిన విధంగా పార్లమెంటులో చెప్పామని, కేంద్రం తీరు పాసిస్ట్ పద్దతిగా ఉందని ధ్వజమెత్తారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.