Private School Teachers : ఈ నెల నుంచే వారి ఖాతాల్లోకి రూ.2వేలు.. కరోనా కష్టకాలంలో సీఎం మానవీయ దృక్పథం

telangana-private-school-teachers-to-get-rs-2000-from-april-month

Private School Teachers : ఈ నెల నుంచే వారి ఖాతాల్లోకి రూ.2వేలు.. కరోనా కష్టకాలంలో సీఎం మానవీయ దృక్పథం

Private School Teachers

Telangana Private School Teachers : కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కూల్స్ తిరిగి తెరిచే వరకు వారికి రూ.2వేలు ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం విదితమే. ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం నేపథ్యంలో మంత్రులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి ఈ నెల (ఏప్రిల్‌) నుంచే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేయగా.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు.

ఈ నెల 20 నుంచి 24వ తేదీ లోపు.. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు డిపాజిట్ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 10 నుంచి 15వ తేదీ వరకు విద్యాశాఖ… అర్హులైన వారి వివరాలను జిల్లాలకు పంపిస్తుందని.. 16 నుంచి 19వ తేదీ వరకు పరిశీలన, లబ్దిదారుల గుర్తింపు ఉంటుందన్నారు. రేషన్ షాపల ద్వారా 25కిలోల బియ్యం ఇస్తామన్నారు.