ఓటీపీ చెబితేనే రేషన్ : లబ్దిదారుల పరేషాన్, ఆధార్ నమోదు, మీ సేవా కేంద్రాల వద్ద క్యూలు

ఓటీపీ చెబితేనే రేషన్ : లబ్దిదారుల పరేషాన్, ఆధార్ నమోదు, మీ సేవా కేంద్రాల వద్ద క్యూలు

Ration mobile OTP : తెలంగాణలో రేషన్‌ లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓటీపీ ఉంటేనే రేషన్ సరుకులు ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించడంతో.. ఆధార్‌ నమోదు కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద చాంతాడంతా క్యూలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి తిప్పలు పడుతున్న బాధితులు..పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటీపీ కష్టాలను గుర్తించిన అధికారులు..ఐరిష్‌తో లబ్ధిదారులను గుర్తించి రేషన్‌ ఇవ్వాలనుకుంటే.. అక్కడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన వన్‌ టైమ్‌ పాస్‌ వర్డ్‌ …ఓటీపీ చూపిస్తేనే రేషన్‌ సరుకులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ ఆదేశించడంతో.. వీరంతా ఇలా క్యూ కట్టాల్సి వచ్చింది. ఆధార్‌ నమోదు కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు రేషన్ కార్డుదారులు.

ఐరీస్ లేదా ఓటీపీ ద్వారా రేషన్ : –
కరోనా వ్యాప్తి-హైకోర్టు ఆదేశాలతో.. వేలిముద్రల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిలిచిపోయింది. ఐరిస్‌ లేదా ఓటీపీ ద్వారా రేషన్‌ ఇవ్వొచ్చని ఆదేశించడంతో సర్కార్‌ ఆ దిశగా చర్యలు తీసుకుంది. అయితే చాలామంది ఆధార్‌ కార్డులకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేసి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. వారం రోజులుగా ఆధార్‌ నమోదు కోసం తిరుగుతున్నారు. గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. వాస్తవానికి వీరందరికి దశాబ్ధం క్రితమే ఆధార్ కార్డులు అందాయి. అయితే అప్పట్లో చాలామందికి సెల్‌ ఫోన్లు లేకపోవడం, తర్వాత కాలంలో కొనుక్కున్నా ఫోన్‌ నెంబర్లు తరచూ మార్చడానికి తోడు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవడంలో అలసత్వంతో ఇప్పుడీ కష్టాలు వచ్చాయి. కొంతమందికయితే ఇప్పటికే సెల్‌ఫోన్లు లేవు. ఇప్పటికిప్పుడు ఫోన్లు కొంటున్నవారు కొందరుంటే, నిరక్ష్యరాస్యులకు ఓటీపీ అయోమయం కలిగిస్తోంది. దీంతో మీ సేవా కేంద్రాల వద్ద క్యూ పెరిగిపోతోంది.

సాంకేతిక సమస్యలు : –
రేషన్ షాపుల వద్ద జాప్యం జరుగుతోంది. అన్నిటికీ మించి మండలానికి ఒక కేంద్రం వద్దే ఆధార్‌-ఫోన్‌ నెంబర్‌ను లింకు చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో వృద్ధులు, మహిళలు, గర్భవతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 10 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ కాస్తా, సర్వర్‌ డౌన్‌తో గంట పడుతుండేసరికి చాలా మంది రాత్రి వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు కొంతమంది దళారులు తయారయ్యారు. ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ అనుసంధానానికి ఎడాపెడా దోచేస్తున్నారు. పరిస్థితిని గమనించిన పౌరసరఫరాల శాఖ.. ఐరిష్‌ ద్వారా సరుకు పంపిణీ చేయాలని ఆదేశించింది. అయితే యంత్రాల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో.. అందరికీ రేషన్‌ అందట్లేదు.

లబ్దిదారుల్లో ఆందోళన : –
దీంతో ఐరిస్‌ ద్వారా బియ్యం పంపిణీ సాధ్యం కాకపోతేనే ఓటీపీ అడగాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులిచ్చింది. మరోవైపు ఆధార్‌ డేటాబేస్‌లో కార్డుదారుల ఫోన్‌ నెంబర్లను ఈ-పాస్‌ ద్వారా అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆధార్‌ కార్డును ఫోన్‌ నెంబర్‌కు లింక్‌ చేసే బాధ్యతను రేషన్‌ డీలర్లకే అప్పగించాలని కొంతమంది బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రేషన్ కోసం ఎవ్వరూ పరేషాన్‌ కావొద్దని రెవెన్యూ అధికారులు సెలవిస్తున్నారు. ఫోన్‌ నెంబర్‌ లింక్ చేసేందుకు గడువేమీ లేదని, కంగారు పడొద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, ఈ నెల రేషన్‌ తీసుకోవాలన్న ఆతృతలో రోజులు గడిచేకొద్దీ లబ్ధిదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది.