తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

Telangana Registrations : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని, వ్యవసాయేతర ఆస్తుల ముందస్తు స్లాట్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర సీఎస్ ప్రకటించారు. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని, ప్రస్తుతానికి కార్డు పద్ధతిలోనే చేస్తారన్నారు. 2020, డిసెంబర్ 19వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సాంకేతిక నిపుణలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఇదే అంశంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆధార్ నంబర్ నమోదు చేయకుండా.. రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆధార్‌ ఆప్షన్‌నే ధరణి వెబ్‌సైట్‌ నుంచి తీసివేయాలని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో ఆధార్ కాకుండా ఇంకా ఎలాంటి ప్రూఫ్ తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కులం ప్రస్తావన కూడా అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. తాజాగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సీఎస్ స్పష్టం చేశారు.