తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 216మంది బాధితులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 216మంది బాధితులు

Telangana Reports 216 Coronavirus

telangana reports 216 coronavirus new cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందారు. కొవిడ్‌ బారి నుంచి 168 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,918 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 749 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

బాబోయ్.. దేశంలో 25వేల చేరువలో కొత్త కేసులు:
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,882 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 140 మంది వైరస్‌కు బలయ్యారు. తాజా మరణాలతో దేశంలో మొత్తంగా 1,58,446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మళ్లీ 2లక్షలు దాటిన కరోనా కేసులు:
గడిచిన 24 గంటల్లో 19వేల 957 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,09,73,260 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 96.82శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 8.40లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్నిరోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండంతో దేశంలో యాక్టివ్ కేసులు మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్‌ కేసులుండగా.. ఈ రేటు 1.78శాతానికి పెరిగింది.

మహారాష్ట్రపై కరోనా పంజా:
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్‌ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 64శాతం కేవలం ఆ రాష్ట్రంలోనే బయటపడటం గమనార్హం. శుక్రవారం(మార్చి 12,2021) అక్కడ 15వేల 817మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,82,191కి పెరిగింది.

మహారాష్ట్రలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా గతేడాది(2020) అక్టోబర్ 2న 15వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న మరో 56 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.