తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Corona Telangana

Telangana Covid19 : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల 583 ఉన్నాయి. వీరిలో 1,815 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

గడిచిన 24 గంటల్లో 33వేల 930 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,690గా ఉంది. తాజాగా 313 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,00,469కి పెరిగింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో 146 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం(మార్చి 29,2021) ఉదయం బులెటిన్ విడుదల చేసింది.

మాస్కు మస్ట్:
రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందనో, అంతగా ప్రభావం చూపడం లేదనో కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ విజృంభిస్తూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పని, బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేసింది.

మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ర్యాలీలు, ఒకేచోట ప్రజలు గుంపులుగా ఉండడంపై ఆంక్షలు విధించింది. మార్చి 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు,
పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని సూచించింది.

హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్‌ తదితర పండుగల సందర్భాల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు విధిగా అమలయ్యే లా చూడాలని కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.