Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని భావించిన ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం

Ap And Tg

AP Irrigation Projects : తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని భావించిన ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ కేబినెట్‌ వ్యతిరేకించింది. నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి తెలపడంతోపాటు.. న్యాయపోరాటానికి రెడీ అవుతోంది తెలంగాణ. 2021, జూన్ 19వ తేదీ శనివారం తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ప్రాజెక్టులపై చర్చించారు.

ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సీరియస్ : –
ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు.. రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణం మరోసారి మంటలు రాజేస్తోంది. ఆర్డీఎస్‌, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాలను తెలంగాణ కేబినెట్‌ తీవ్రంగా ఖండించింది. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కేసులు కూడా వేసింది. ఎన్‌జీటీ (NGT)తోపాటు కేంద్రం కూడా ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడంపై తెలంగాణ తీవ్రంగా పరిగణిస్తోంది.

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా : –
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్ ఏర్పడి 17 సంవత్సరాలు అయినా.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు పూర్తయినా.. కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్ధారణ కాలేదని కేబినెట్‌ అభిప్రాయపడింది. దీంతో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956 సెక్షన్‌ -3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయితే సుప్రీంకోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్‌-3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని.. తెలంగాణ కేసులను విరమిస్తే తాము త్వరగా నిర్ణయిస్తామని అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలంగాణ తెలిపింది.

కృష్ణా నీటి వాటా : –
కేంద్రమంత్రి హామీ మేరకు తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో వేసిన కేసును విరమించుకుని కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రం సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతో కేసును ఉపసంహరించుకున్నా.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతాంగ ప్రయోజనలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతదూరమైనా పోవాలని డిసైడ్‌ అయ్యింది. ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులతో…. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేబినెట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి ఈ సమావేశంలో పలు నిర్ణయాలనుతీసుకుంది.

పార్లమెంట్ సమావేశాల్లో : –
తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకొని… రాష్ట్ర రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్రజలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనుంది. అంతేకాదు.. ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఏపీ జలదోపిడీని ఎత్తిచూపాలని కూడా భావిస్తోంది. రాబోయే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశంలో ఈ అంశంపై గళం విప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. అంతేకాదు.. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో… కృష్ణా బేసిన్‌ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరుగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.