Yadadri Temple: యాదాద్రి టెంపుల్ కోసం ఆర్బీఐ నుంచి 125కేజీల బంగారం

యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్.. కుటుంబం తరపున 1.16కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

10TV Telugu News

Yadadri Temple: యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్.. కుటుంబం తరపున 1.16కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సందర్శనార్థం గుడిని 2022 మార్చి 28న తెరవనున్నారు. యాదగిరిగుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. రాబోయే ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ అయిన యాదాద్రికి ‘విమాన గోపురం’ (టెంపుల్ టవర్) బంగారు పూత కోసం 125 కిలోల బంగారం అవసరమని తెలుసుకున్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి అవసరమైన బంగారాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.

కేసీఆర్ ప్రధాన ఆలయానికి చేరుకుని పెంబర్తి కళాకారులు నిర్మించిన ప్రత్యేక తలుపులను పరిశీలించారు. తనతో పాటు ఆలయంలో ఉన్న వారితో ఆలయ గోడలపై చెక్కిన శిల్పాల ప్రాముఖ్యత గురించి కూడా సీఎం మాట్లాడారు.

“నిపుణుల అంచనా ప్రకారం, 125 కేజీల బంగారం అవసరమని తెలిసింది. దీని విలువ సుమారు రూ. 60 నుండి 65 కోట్లు ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. నిధుల సేకరణను పూర్తి చేసి, RBI నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తాం. అలా స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది’ అని దేవాలయాన్ని సందర్శనానంతరం సీఎం కేసీఆర్ విలేకరులతో అన్నారు.

తెలంగాణ సీఎంతో పాటు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు కలిపి 14 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 125 కిలోల బంగారం విరాళంలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని.. సీఎం అన్నారు. ఇప్పటికే చాలా మంది బంగారం దానంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని వివరించారు.

* కార్మిక మంత్రి మల్లా రెడ్డి దేవాలయానికి 1 కేజీ బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. మేడ్చల్‌లోని తన నియోజకవర్గ ప్రజలు మరో కేజీని విరాళంగా ఇస్తారు.
* నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2 కేజీల బంగారాన్ని, భాస్కర్ రావు కావేరీ సీడ్స్ తరపున 1 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తారు.
* శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి తన పీఠం నుంచి ఆలయానికి కిలో బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు.
* మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు గాంధీ, ఎం.హనుమంత రావు, ఎం కృష్ణారావు, కెపి వివేక్ ఆనంద్ 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఆలయ పున:ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులకు తెలంగాణ సీఎం ఆహ్వానం పంపారు.