Merged Villages: పోలవరం ముంపు గ్రామాలు మళ్లీ తెలంగాణలోకి?

భద్రాచలంలో ఐదు గ్రామాల అంశంపై మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగుతోంది.

Merged Villages: పోలవరం ముంపు గ్రామాలు మళ్లీ తెలంగాణలోకి?

Polavaram (2)

Merged Villages: భద్రాచలంలో ఐదు గ్రామాల అంశంపై మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగుతోంది. భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు. అవసరమైతే ఈ గ్రామల కోసం ప్రధాని నరేంద్రమోదీని కూడా కలుస్తానని చెబుతున్నారు కేసీఆర్.

కేసీఆర్ నిర్ణయంతో ఐదు గ్రామాల వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. 2014 జూన్‌లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కూనూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాల పేరుతో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిశాయి.

సదరు మండలాలు, గ్రామాలను ఏపీలో కలిపే సమయంలో ఇక్కడి ప్రజల మనోభావాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని, అశాస్త్రీయంగా గ్రామాలను కలుపుకున్నారని అభిప్రాయపడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం.

ఆయా గ్రామాల్లోని ప్రజలు కూడా తెలంగాణలో తిరిగి విలీనం అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆనందంగా ఉన్నారని, టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అక్కడి ప్రజలు కూడా ప్రభుత్వపరంగా ఏ అవసరం వచ్చినా వందల కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, దూరభారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.