జాగ్రత్త సుమా..గిప్పుడే ఏం ఎండలు, మున్ముందు ఎట్లుంటుందో

భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు.

జాగ్రత్త సుమా..గిప్పుడే ఏం ఎండలు, మున్ముందు ఎట్లుంటుందో

Summer Hot

Telangana Weather hottest summer : భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలను తట్టుకోవడం కష్టంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడ నీడ దొరికితే అక్కడ సేదతీరుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వారు కొద్దిసేపు చెట్ల నీడన సేదతీరుతూ.. గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వేసవి తాపం నుంచి బయపడేందుకు కొబ్బరి బొండాలు, చెరుకురసం, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలకు గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం శరీరంపై పడి, దాహార్తితో పరితపించిపోతున్నారు. ఉక్కబోత పెరగడంతో జనం ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఇంతటి ఎండలు ఉంటే.. మున్ముందు ఎలా మంట పుట్టిస్తాయోనని భయాందోళనకు గురుతున్నారు. ఇంతటి ఎండల్లో వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అత్యసరంగా వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో రోజు రోజుకు వేసవి తీవ్రత పెరుగుతోంది. భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం నుంచి ఎండలు తీవ్రం దాల్చుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వడగాల్పులు దఢపుట్టిస్తున్నాయి. ఆ సమయంలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. మార్చి చివరి వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలుచోట్ల 41 డిగ్రీలు దాటాయి. 2021, మార్చి 27వ తేదీ శనివారం జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌, మంచిర్యాల జిల్లా భీమినిలో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే జగిత్యాల జిల్లా కోరుట్లలో 41.3 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.5 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయిలో 40.4, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ, ఆదిలాబాద్‌ పట్టణంలో 40.3 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్‌ఎంసీలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవగా, అత్యధికంగా నారాయణగూడలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. గత వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను తాకింది. ఈ సీజన్‌లోనూ ఇంచుమించు గత ఏడాదిలాగే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2021, మార్చి 28వ తేదీ ఆదివారం, 29వ తేదీ సోమవారం 40 డిగ్రీలు దాటే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల మేర పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది.
Read More : Indigo started services from orvakal : కర్నూలు నుంచి ప్రారంభమైన విమాన సర్వీసులు