Telangana Covid 19: తెలంగాణలో కోవిడ్ విలయతాండవం, రికార్డు స్థాయిలో కొత్త కేసులు

Telangana Covid 19: తెలంగాణలో కోవిడ్ విలయతాండవం, రికార్డు స్థాయిలో కొత్త కేసులు

Telangana Covid

Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 337 మంది కోలుకోగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల 551 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,166 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో 684 కేసులు నమోదు కాగా.. గురువారం నాటి బులెటిన్‌లో ఆ సంఖ్య 887కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాల జిల్లాలో 56 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. ఇప్పటి వరకు 3,01,564 మంది కోలుకోగా.. 1,701 మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒకే రోజు 59,297 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు అంటున్నారు. భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ప్రచారం చేస్తున్నా కూడా వారిలో మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

ఏపీపై కరోనా పంజా:
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,184 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కేసులు, మరణాలు:
తాజాగా నమోదైన 1,184 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,01,989 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారికి మరో నలుగురు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మరణాలతో ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7,217కి పెరిగింది.

గంటూరు జిల్లాలో అత్యధిక కేసులు:
జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులని చూస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 352, విశాఖపట్నం జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణాజిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 66, కర్నూలు జిల్లాలో 64, కడప జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 45, తూర్పుగోదావరి జిల్లాలో 26, విజయనగరం జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 456 మంది పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల 338గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,50,83,179 నమూనాలను పరీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులు కోరారు.

ఇండియాలో లాక్ డౌన్ తప్పదా?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మరణాలు నమోదవడం వెన్నులో వణుకు పుట్టించింది.

24 గంటల్లో 72వేలకు పైగా కొత్త కేసులు, 459 మరణాలు:
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 11లక్షల 25వేల 681 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..72వేల 330 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 459 కరోనా మరణాలు సంభవించాయి. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ మరింత రెచ్చిపోతోంది. రోజురోజుకూ భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది మహమ్మారికి బలికావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గడిచిన 24గంటల్లో మరో 40వేల 382 మంది కరోనాను జయించారు.

కరోనా కేసుల నమోదుకు సంబంధించి దాదాపు ఆరు నెలల్లో దేశంలో ఇదే అతి పెద్ద నమోదని కేంద్రం తెలిపింది. గత ఏడాది(2020) అక్టోబర్ 10 న దాదాపు 74వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే. సెకండ్ వేవ్ లో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌-19వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కేసుల నమోదులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్ ఛత్తీస్‌గడ్‌ ముందు వరుసలో ఉన్నాయి.