తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు

40 degrees Temperatures : తెలంగాణలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. వేసవికాలం రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి చివరలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ఖమ్మం జిల్లాలోని మధిరలో 39.3 డిగ్రీల చొప్పున రికార్డు అయింది.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 13.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ సాధారణ స్థాయి దాటుతున్నాయి.

పగలు ఎండలు పెరిగిపోయాయి. రాత్రిళ్లూ ఉక్కపోతగా ఉంటోంది. శనివారం 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి ఎండలు మరింత పెరుగొచ్చని పేర్కొన్నారు.