మద్యం తాగి వాహనం నడిపితే పదేళ్ల జైలు శిక్ష

మద్యం తాగి వాహనం నడిపితే పదేళ్ల జైలు శిక్ష

Ten years imprisonment for driving under the influence of alcohol  :  కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న మందుబాబులకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ షాక్‌ ఇచ్చారు. తాగి వాహనం నడిపితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. తాగి వాహనం నడిపేవారు ఉగ్రవాదులతో సమానమని వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదని.. అందుకే వాళ్లు తీవ్రవాదులతో సమానమన్నారు. నిన్న ఒక్కరోజే 402 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులనూ భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదికను సజ్జనార్‌ మంగళవారం విడుదల చేసి, విజన్‌ 2021ను ప్రకటించారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట, సీసీటీవీ కెమెరాల పెంపు, సైబర్‌ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

రహదారిపై ఏ చిన్న వాహనం వెళ్లి పెద్ద వాహనాన్ని ఢీకొట్టినా పెద్ద వాహనదారుడిపైనా కేసు నమోదు చేస్తున్నారని దీనికి స్వస్తి పలికి ఎవరు ప్రమాదం చేస్తారో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదును 2021లో పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. జీవో నంబర్‌ 167 ప్రకారం సైబరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచుతామన్నారు. ఈ ఏడాది 1,23,000 సీసీ కెమెరాలు బిగించామని.. 2021లో దీనికి రెట్టింపు అమరుస్తామని చెప్పారు.

నగరంలోని రహదారులపై వెళ్లే వాహనాలను సీసీటీవీ కెమెరాల ద్వారా సైబరాబాద్‌లోని భారీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పరిశీలించవచ్చన్నారు. ఫలితంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనుల భరతం పడతామని అన్నారు. నేరం జరిగితే నేరగాళ్లనూ పట్టుకుంటామని చెప్పారు. ట్రాఫిక్‌ జామ్‌ అయితే వెంటనే క్లియర్‌ చేసేలా సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సేవలను కీలకంగా వినియోగించుకుంటామని చెప్పారు.