దుబ్బాకలో బీజేపీ విజయానికి కారణమిదే

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 06:40 AM IST
దుబ్బాకలో బీజేపీ విజయానికి కారణమిదే

Bjp Social Media

BJP’s victory in Dubbaka : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి సరికొత్త వ్యూహమే కారణమా? స్మార్ట్ ఫోనే మైక్ సెట్.. వాట్సాప్‌ డిజిటల్ ప్రొజెక్టర్.. ఫేస్‌బుక్‌ను వాల్ పోస్టర్లుగా వినియోగించుకుందా?. సోషల్ మీడియానే వార్తా ఛానల్, న్యూస్ పేపర్‌గా మార్చుకుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటోంది కాషాయదళం.



సోషల్ మీడియా : – 
ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి రావడానికి సోషల్‌ మీడియానే ఉపయోగపడింది. అదే ఫార్మూలను దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఫాలో అయ్యారు. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో ముందున్న బీజేపీ-దుబ్బాక ఉపఎన్నికల్లోనూ ప్రచారానికి వినియోగించింది. సోషల్‌ మీడియా ప్రచారానికి సభలు, సమావేశాలు, సమీకరణలు అక్కరలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు… సమాచారాన్ని క్షణాల్లో ఓటర్లకు చేరవేయొచ్చు. ఈ విషయంలో బీజేపీ అధికార టీఆర్ఎస్‌ కన్నా ఎన్నో రెట్లు ముందుంది.



రఘునందన్ రావుకు ఫాలోయింగ్ : – 
ఇతర పార్టీల అభ్యర్థులతో పోలిస్తే.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఫేస్‌బుక్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆయన ఫేస్ బుక్ పేజీని 2.31 లక్షల మంది లైక్‌ చేయగా.. 3.14 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. దీంతో.. ఆయన పోస్టులు వేగంగా ప్రజల్లోకి వెళ్లాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఆఫ్‌లైన్‌లో ఆరోపణలు చేస్తూనే… ఆన్‌లైన్‌లోనూ బీజేపీ వాటిని పదే పదే షేర్ చేస్తూ వైరల్ చేసింది. ప్రత్యర్థుల తప్పులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. బీజేపీ సోషల్‌ నెటవర్క్‌ టీమ్. టీఆర్ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మాటతీరుపై వ్యంగ్యంగా రూపొందించిన వీడియోను బీజేపీ విపరీతంగా వైరల్‌ చేసింది..



పోస్టులు వైరల్ : – 
రఘునందన్‌రావు మామ ఇంట్లో డబ్బులు దొరికిన సమయంలో పోలీసులే ఆ డబ్బులు తెచ్చి పెట్టారని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. మరుసటిరోజు పోలీసులు ఆధారాలతో వివరణ ఇచ్చినా.. దాన్ని వైరల్‌ చేయడంలో టీఆర్ఎస్‌ విఫలమైంది. చివరిరోజున కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి కారులో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి వెళ్లారంటూ వైరల్‌గా మారిన ఓ వీడియో బీజేపీ శ్రేణులకు కలిసివచ్చింది. పోలింగ్‌ రోజున రెండు టీవీ చానళ్ల లోగోలతో.. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ ఫేక్‌ న్యూస్‌ హల్‌చల్‌ చేసింది.



హరీశ్ రావు ప్రెస్ మీట్ : – 
ఇది బీజేపీ కుట్రే అంటూ, కాంగ్రెస్ టీఆర్ఎస్‌ ఆరోపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతే కాకుండా గతంలో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ పొగుడుతూ మాట్లాడిన వీడియోలనూ కూడా వైరల్‌ చేశారు. కమలనాథులు చెప్పాలనుకున్నవి సూటిగా, సుత్తి లేకుండా పోస్టులు, వీడియోలు సామాన్య ఓటర్లలోకి వేగంగా చొచ్చుకుపోయాయి. పింఛన్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. దీంతో మంత్రి హరీశ్‌రావ్‌ మూడుసార్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.



మొత్తానికి సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైంది. బీజేపీ మాత్రం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకుని గెలుపు తీరానికి చేరింది.