ఎగురుతున్న విమానంలో అపద్బాంధవుడు…

ఎగురుతున్న విమానంలో అపద్బాంధవుడు…

The doctor who saved the baby’s life during the fligt travel  : విమాన ప్రయాణంలో ఓ వైద్యుడు శిశువు ప్రాణం కాపాడారు. అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఆగిపోయి, శరీరం నీలం రంగంలోకి మారిన రెండు నెలల పసిపాపకు ప్రణామ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మనీష్ గౌర్ చేసిన వైద్యం పునర్ జన్మనిచ్చినట్లైంది. ఈ ఘటన ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.

విమానం గాలిలోకి ఎగిరిన 10 నిమిషాలకు ఓ మహిళ ఏడ్వటం ప్రారంభించారు. అందులోని సిబ్బంది ఆమెను ఓదార్చేందుకు వెళ్లారు. తన పాపకు శ్వాస తీసుకోవడం ఆగిపోయిందని, శరీరం నీలం రంగులోకి మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విమాన సిబ్బంది ప్రయాణికుల్లో డాక్టర్లు ఉన్నారా అని మైకులో ప్రకటన చేశారు.

దీంతో డాక్టర్ మనీష్ అక్కడికి వెళ్లి మహిళ చేతిలోని శిశువును పరిశీలించి వైద్యం చేశారు. ఆయన స్వతహాగా చిన్నపిల్లల డాక్టరు కావడంతో అవసరమైన చికిత్సా విధానాలు చేపట్టారు. కొద్దిసేపటికే పాప శ్వాస తీసుకోవడం ప్రారంభమైంది. ఐదు నిమిషాలకు శీరరం రంగు యథాతథ స్థితికి చేరుకోవడంతో తోటి ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓ ప్రయాణికుడు దీన్ని స్నేహితుల ద్వారా సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

విమాన ప్రయాణంలో రెండు నెలల పసిపాపకు ప్రాణాపాయం తలెత్తడం, ఆమెను తాను రక్షించడం మరచిపోలేని అనుభవమని ప్రణామ్ ఆస్పత్రి ఎండీ, డాక్టర్ మనీష్ గౌర్ అన్నారు. చికిత్సకు పాప స్పందించిందని తెలిపారు. హైదరాబాద్ కు వెళ్లే వరకు ఆమెను కనిపెట్టుకుని ఉన్నానని పేర్కొన్నారు.

చిన్నారి నెలలు నిండకముందే జన్మించడంతో బరువు చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల విమానం పైకి ఎగిరే క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైందని చెప్పారు. పాపను ఎందుకు తీసుకొస్తున్నారని అడిగితే కంటి సమస్యతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకొస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించారు.