Musi River : ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది

భారీ వర్షాలకు అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది.

Musi River : ఎడతెరిపిలేని వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది

Musi River

floodwaters into the Musi River : గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారడంతో అధికారులు 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల వాహనాలు దారి మళ్లించారు.

సాధారణ వర్షాలు పడితేనే హైదరాబాద్‌ నరకాన్ని తలపిస్తోంది. ఇక కుండపోత వాన ఎడతెరిపిలేకుండా కురిస్తే ఊహించడమే కష్టమవుతుంది. తాజాగా గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటినుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.

Cyclone Gulab: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మరోవైపు నగరంలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరిక జారీ చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గతేడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి నగరం సాగరమైంది. వీధులు నదులయ్యాయి. దారులు గోదారులయ్యాయి. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు… బతుకమ్మలను తలపించాయి. మహానగరంలో ఎటు చూసినా ఇప్పటికీ ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఆనాటి భయం హైదరాబాద్ వాసులను ఇంకా వెంటాడుతోంది.

Telugu States : మూడు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

ప్రస్తుతం దంచికొడుతున్న వానలు, వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. దీంతో చినుకు పడితే చాలు నగర ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. మరోసారి అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. మరోవైపు గతేడాది అనుభవాలతోనూ గుణపాఠం నేర్వని జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు… వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.