ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు..అనుమానంతో భార్యను చంపేశాడు

ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు..అనుమానంతో భార్యను చంపేశాడు

husband who murdered his wife : ఇష్టపడ్డాడు.. వద్దంటున్నా వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. చదువుకు ఆటంకం కలిగించనంటూ వాగ్దానం చేసి మనువాడాడు. అంతలోనే అనుమానాన్ని నరనరాన నింపకొని కర్కోటకుడిగా మారాడు. ఇష్టపడ్డ ఇల్లాలినే దారుణంగా హత్య చేశాడు. నమ్మించి తీసుకెళ్లి మట్టుబెట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. భార్య కనిపించడం లేదంటూ పోలీసులనూ ఆశ్రయించాడు. దొంగ నాటకలాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ చివరికి పోలీసుల ముందు కట్టుకున్నదాన్ని తానే చంపాననే నిజం ఒప్పుకొని కటకటాల పాలయ్యాడు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఈ దారుణం జరిగింది. మధిర మండలం ఎర్రుపాలెనికి చెందిన నవ్యరెడ్డిని నాగశేషురెడ్డి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. చదువుకుంటున్న అమ్మాయికి వివాహం చేయడం ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులు వారించినా… పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలిగించనంటూ నమ్మబలికాడు. అన్నట్టుగానే పెళ్లి తర్వాత కూడా చదువుకునేందుకు అనుమతి ఇచ్చాడు. అయితే అతనిలో అనుమానం మొదలైంది. అది నరనరాన పాకి ఉన్మాదిగా మారాడు. రోజులాగే కాలేజీకి తీసుకెళ్తానని చెప్పిన నాగశేషురెడ్డి.. నవ్యను కాలేజీకి సమీపంలోని కొత్త లంకపల్లి కుక్కల గుట్టకు తీసుకెళ్లాడు. తనకున్న అనుమానాలతో ఆమెతో గొడవపడ్డాడు.

పిచ్చి కోపంలో ఆమె గొంతు నులిమి ఊపిరి తీశాడు. తర్వాత చున్నీతో చెట్టుకు ఉరివేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా కాలేజీ నుంచి నవ్య ఇంటికి రాలేదంటూ నాటకమాడుతూ పోలీసులను ఆశ్రయించాడు. తనకేమీ తెలియదంటూ దొంగ ఏడుపులు ఏడ్చాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. నవ్య కోసం గాలింపు మొదలుపెట్టారు. విచారణలోనే అసలు విషయాలు బయటపడ్డాయి. నవ్యరెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో నాగశేషురెడ్డిని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను గొంతు నులిమి చంపినట్టు ఒప్పుకున్నాడు. కుక్కల గుట్టకు తీసుకెళ్లి భార్యను చంపిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో మిస్సింగ్‌ కేసు కాస్తా.. మర్డర్‌ కేసుగా మారింది. నాగశేషురెడ్డిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.