Meet Maira: రెస్టారెంట్లో రోబో.. వెయిటర్ మాత్రమే కాదు.. అంతకు మించి!

Meet Maira: రెస్టారెంట్లో రోబో.. వెయిటర్ మాత్రమే కాదు.. అంతకు మించి!

Meet Maira

Meet Maira: రెస్టారెంట్ లో వెయిటర్ అంటే మనం చెప్పింది వినమ్రంగా విని.. కావాల్సింది తెచ్చి పెట్టి.. మనకి ఏది కావాలన్నా చేసి పెడతారు. అలా ఈ సేవలకు రోబోలను వినియోగించే ప్రయత్నాలు కొద్దికాలంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో కొన్ని నగరాలలో ఇలాంటి రోబోటిక్ రెస్టారెంట్లు కూడా నడుస్తున్నాయి. అయితే.. మన హైదరాబాద్ నగరంలో ఓ రెస్టారెంట్ లో రోబో మాత్రం వెయిటర్ మాత్రమే కాదు.. అంతకుమించి సేవలందిస్తుంది.

కస్టమర్లు రెస్టారెంట్ లో అడుగుపెట్టిన దగ్గర నుండి మళ్ళీ అడుగు బయటపెట్టే వరకు మీతోనే ఉంటూ.. మీకు కావాల్సింది చేసి పెడుతుంది. హలో వెల్ కం దగ్గర నుండి.. మీ ఆర్డర్ మీ టేబుల్ మీదకి వచ్చేవరకు మీకు కబుర్లు చెప్తూ సందడి చేస్తుంది. ఆడవారితో ఆడవారిలాగా.. పిల్లలతో పిల్లల్లా గొంతులు కూడా మార్చుకొని వారితో ముచ్చట్లు పెడుతుంది. ఇందుకు ఈ రోబోకు ముఖకవళికలు కూడా మార్చుకుంటుంది. ఈ రోబో పేరే మైరా ((Maira).

హైద‌రాబాద్‌ నగరానికి చెందిన విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ తయారు చేసిన ఈ మైరా రోబో పరిసరాలను చూసేలా, అనుభూతి చెందేలా, చెప్పింది విన‌గ‌లిగేలా ప్రోగ్రామ్ చేయబడి ప‌రిస‌రాల‌కు త‌గిన‌ట్లు మారిపోతుంది. భారతదేశంలో ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న మొద‌టి రోబో ఇదేన‌ని దీనిని తయారు చేసిన సంస్థ వ్యవస్థాపకుడు రామరాజు సింగం చెప్తున్నారు.

ఏ పేరుతో పిలిచినా స్పందించేలా ప్రోగ్రామ్ చేయబడిన మైరా మ‌నం ఇచ్చే ఆదేశాలకు ప్రతిస్పందించి.. సేవలు చేసి పెడుతుందట. ఇన్ని ప్రత్యేకతలున్న రోబోలు కాబట్టే సమీప భవిష్యత్తులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ప్రారంభించబోయే కాన్సెప్ట్ రెస్టారెంట్ల కోసం అవ‌స‌ర‌మైన‌ మరిన్ని రోబోల త‌యారీ కోసం ఈ కంపెనీ మరిన్ని ఆర్డర్లు అందుకుందట.