అమావాస్య ముహూర్తం : కార్పొరేటర్ల తర్జనభర్జన

అమావాస్య ముహూర్తం : కార్పొరేటర్ల తర్జనభర్జన

ghmc corporators : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుకాబోతుందా? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక కొత్త తేదీన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారా?.. గత డిసెంబర్ 1న హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన వారంతా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశించారు. కానీ వారి ఆశలపై ఎన్నికల కమిషన్ అధికారులు నీళ్లు చల్లారు. ఫిబ్రవరి 11వ తేదీన 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు గెలిచిన కార్పొరేటర్లు తర్జనభర్జన పడుతున్నారు.

ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం ఫిబ్రవరి 11వ తేదీన మధ్యాహ్నం పన్నెండున్నరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించాలి. అయితే ఆ ఆరోజు అమావాస్య కావడంతో ఆ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలా వద్దా అని నేతలు డైలమాలో ఉన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టరు. దీంతో ఆ తేదీన ప్రమాణ స్వీకారంపై కొంత మంది కార్పొరేటర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముహూర్తం చూసుకోకుండా అమావాస్య రోజున ప్రమాణ స్వీకారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమావాస్య కారణంగా ఒకవేళ బీజేపీకి చెందిన కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకపోతే.. ప్రమాణ స్వీకారం చేయకపోతే మేయర్ ఎన్నిక లెక్క వేరేగా ఉంటుంది. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు హాజరైతే.. కోరం ఉంటుంది కాబట్టి.. ఏకపక్షంగా మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లను సొంతం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. కావాలనే అమావాస్య తేదీని ఎన్నికల కమిషన్‌కు సూచించేలా అధికార పార్టీ ఒత్తిడి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మరింత లోతుగా చర్చించి.. ఎన్నికల కమిషన్‌ను కలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.