జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana government key decision on the Department of Water Resources : జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖను పునర్ వ్యవస్థీకరించింది. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ స్వరూపాన్ని మార్చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటి పారుదల శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చింది. ప్రాదేశిక ప్రాంతాలుగా విభజిస్తూ కొత్త అధికారులను నియమించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ, మధ్య, చిన్నతరహా నీటి పారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుకు కిందికి తేవడంతో పాటు.. అన్ని రకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పోస్టుల సంఖ్యను పెంచారు.

రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి.. ఒక్కొక్క దానికి ఒక్కో చీఫ్ ఇంజినీర్‌కు పర్యేవేక్షణ బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముగ్గురు ఈఎన్సీలు ఉండగా.. మరో ముగ్గురిని నియమించి.. మొత్తం ఆరుగురు ఈఎన్సీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. పునర్ వ్యవస్థీకరణ కారణంగా మొత్తం ఇరిగేషన్ శాఖలో 945 అదనపు పోస్టులు అవసరం అవుతాయని సీఎంకు అధికారులు వివరించారు.

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రభుత్వం చూస్తోందని రివ్యూ సమావేశంలో కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఛనాక – కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్ట పనులు వచ్చే వానాకలం నాటికి పూర్తి చేయాలని.. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలన్నారు. పరకాలలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను కూడా తక్షణమే కంప్లీట్ చేయాలన్నారు.

ఉప ఎన్నిక సమయంలో హుజూర్ నగర్‌కు ఇచ్చిన హామీలో భాగంగా ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు చేయాలని, వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటు చాలా రోజులుగా పెండింగ్‌లో పడుతూ వస్తున్న అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీని కోసం వెంటనే సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.