తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి నిర్ణయం తీసుకున్నారని సోమేశ్ కుమార్ తెలియజేశారు.

అంతకుముందు ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్ష జరిపారు. అందులో తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని మోడీ గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం మోడీకి తెలిపింది. కాగా.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి ఏటా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తోంది.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద కోవిడ్-19తో సహా 15 వందల రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్‌ భారత్‌ను ఇప్పటివరకు తెలంగాణలో అమలు చేయలేదు. గతంలో ఈ పథకాన్ని అమలు చేయని 4 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే కేసీఆర్ ఇంతకాలం.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన తన నిర్ణయాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకం కావడంతో తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది.