సైనిక్ పురి చోరీ ఘటనలో వాచ్ మెన్ దంపతులే నిందితులు

  • Published By: bheemraj ,Published On : August 3, 2020 / 07:43 PM IST
సైనిక్ పురి చోరీ ఘటనలో వాచ్ మెన్ దంపతులే నిందితులు

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్ పురిలో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇంటి వాచ్ మెన్ దంపతులే నిందితులని తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంటి వాచ్ మెన్ దంపతులే చోరీ చేశారని పోలీసులు గుర్తించారు.



నేపాల్ కు చెందిన భీమ్ గత ఆరు నెలలుగా కుషాయిగూడ సైనిక్ పురిలోని ఓ రియల్టర్ ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అయితే ఫలక్ నుమా ప్యాలెస్ లో యజమాని కుమారుడి వివాహ రిసెప్షన్ కు కుటుంబమంతా వెళ్లిన సమయంలో వాచ్ మెన్ దంపతులు ఇంట్లో లాకర్ పగులగొట్టి చోరీ చేశారు. చోరీకి పాల్పడిన అనంతరం ఇంట్లోని బైక్ ను తీసుకెళ్లి కిలో మీటరు దూరంలో వదిలి వెళ్లిపోయారు. కుషాయిగూడ చౌరస్తాలో పోలీసులు ఆ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

1.73 కిలోల బంగారం, రూ.2లక్షల నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం రూ.2 కోట్ల విలువైన వస్తువులు పోయినట్లు ఫిర్యాదు అందిందని మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత తెలిపారు. అదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.



ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్ పోర్టు వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.