భారీగా వర్షాలు: హైదరాబాద్‌లో రెడ్ అలర్డ్.. బయటకు రావద్దు..

  • Published By: vamsi ,Published On : October 13, 2020 / 07:44 PM IST
భారీగా వర్షాలు: హైదరాబాద్‌లో రెడ్ అలర్డ్.. బయటకు రావద్దు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది.



సాయంత్రం నాలుగు గంటల నుంచే భారీ వర్షం కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో జీహెచ్ఎంసీ కూడా హై అలర్ట్ ప్రకటించింది. నగరంలో ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణశాఖ వెల్లడించగా.. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో భారీగా వర్షం కురవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



న‌గ‌రంలోని ఖైర‌తాబాద్‌, సోమాజిగూడ‌, బేగంపేట‌, అల్వాల్‌, బోయిన్‌ప‌ల్లి, తార్నాక‌, కుషాయిగూడ‌, ECIL‌, నాచారం, ఎల్‌బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, వ‌న‌స్థ‌లిపురం, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, సంతోష్ న‌గ‌ర్‌, చార్మినార్‌, మ‌ల‌క్‌పేట‌, జూపార్క్‌, లంగ‌ర్‌హౌస్‌, మెహిదీప‌ట్నం, గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, ల‌క్డీకాపూల్, కోఠి, అబిడ్స్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది.



లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వరదలా వచ్చి పడుతుంది. యూసఫ్ గూడ, రెహమత్ నగర్, కార్మిక నగర్, బోరబండ, మోతీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిపే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నిండు కుండల్లా చెరువులు మారిపోయాయి. బాగ్‌లింగం పల్లి, నారాయణ గూడ, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో అయితే వరదలు వచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తుంది.



ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తూర్పు, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా రెడ్ అల‌ర్ట్‌, ఉత్త‌ర‌, ప‌శ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అప్ర‌మ‌త్తం చేశారు.