Hyderabad Doctor : మీరు దేవుడు సామీ.. రూ.10కే వైద్యం అందిస్తున్న డాక్టర్

ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నారు.

Hyderabad Doctor : మీరు దేవుడు సామీ.. రూ.10కే వైద్యం అందిస్తున్న డాక్టర్

Hyderabad Doctor

Hyderabad Doctor : ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోగులు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన, అప్పులపాలు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి రోజుల్లోనూ ఓ డాక్టర్ కేవలం 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు అంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. 10 రూపాయలకు టీ కూడా రాని రోజులివి. అలాంటిది అంత తక్కువ డబ్బుతో వైద్యం చేస్తున్నారు. నిరుపేదలు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, యాసిడ్ బాధితులకు తక్కువ ఖర్చుకే చికిత్స అందిస్తున్నారు ఆ డాక్టర్. కొవిడ్ కష్టకాలంలోనూ తన సేవలు కొనసాగిస్తూ రోగుల పాలిట దేవుడిలా మారారు.

ఆయన పేరు డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌. హైదరాబాద్‌ పీర్జాదిగూడలో ఉంటారు. నాలుగేళ్ల నుంచి ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. తన దగ్గరికి వచ్చే నిరుపేదలు రూ.10 చెల్లిస్తే చాలు వైద్యం చేస్తున్నారు. అంతేకాదు, మందుల్లో 10 శాతం, వైద్యపరీక్షల్లో 30శాతం రాయితీ ఇచ్చి అండగా నిలుస్తున్నారు. నాడీ పట్టకుండానే రూ.500 నుంచి రూ. 1500 వరకు కన్సల్టేషన్‌ ఫీజు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్న ఈ రోజుల్లో ఇమ్మాన్యుయేల్‌ పది రూపాయలకే వైద్యం చేయడ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా తన దగ్గరికి వచ్చేవారి నుంచి ఆయన రూ.200 ఫీజు తీసుకుంటారు. డబ్బులున్న వారి నుంచి పూర్తి మొత్తం తీసుకుంటారు. కానీ నిరుపేదలకు మాత్రం అతితక్కువ ధరకే వైద్యం అందిస్తామని ఇమ్మాన్యుయేల్‌ తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడ్డవారు, తెల్లరేషన్‌ కార్డుదారులు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, దివ్యాంగులు, యాసిడ్‌ బాధితులు.. వీరందరికి రూ.10 ఫీజు తీసుకుంటారు. జవాన్లు, వారి కుటుంబసభ్యులకు ఫీజు లేకుండా చికిత్స అందిస్తారు. వైద్య చికిత్సతో పాటు ల్యాబ్‌ టెస్టులకు సాధ్యమైనంత తక్కువ ధరలు తీసుకుంటారు. సాధారణ రోగులతో పాటు కొవిడ్‌ రోగులకు పది రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ లో పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సుమారు 400 మందికి పైగా చికిత్స చేసినట్టు డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ తెలిపారు. సెకండ్ వేవ్ ఉద్ధృతిలోనూ బాధితులకు చేయూతనందిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండి, తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఇళ్లకే సిబ్బందిని పంపి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పెడుతున్నామన్నారు.

కొవిడ్‌ ప్రారంభమయ్యాక కూడా ఇంతకుముందులాగే క్లినిక్‌ను సేవా దృక్పథంతోనే నడుపుతున్నామని అన్నారు. కరోనా తీవ్రత ఉన్నా లేకున్నా పేదలకు రూ.10 తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఓ ఆసుపత్రిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందులో అన్ని రకాల సదుపాయాలను పేదలకు ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నామని డాక్టర్ తెలిపారు. కాసుల కోసం అడ్డమైన పనులు చేసే మనుషులున్న ఈ రోజుల్లో, డబ్బు సంపాదనే పరమావధిగా పని చేసే వారున్న ఈ రోజుల్లో కేవలం రూ.10కే వైద్యం అందిస్తూ ఈ డాక్టర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.