వరద ఆర్థిక సహాయం రాని వారు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు – కేటీఆర్

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 01:52 PM IST
వరద ఆర్థిక సహాయం రాని వారు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు – కేటీఆర్

Those who do not receive flood financial assistance : హైదరాబాద్ లో వరదల కారణంగా..ఆర్థిక సహాయం పొందలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ సేవలో దరఖాస్తు నింపి అప్లై చేసుకోవాలని సూచించింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2020, నవంబర్ 14వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు.



హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న 15 పట్టణాల్లో కురిసిన కుంభవృష్టి వల్ల..లక్షలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురయ్యారన్నారు. అందరం కలిసి కాలనీల్లో పర్యటించామనే విషయాన్ని గుర్తు చేశారు. ఇళ్లలోకి చేరిన నీరు, మంచాలు తేలడం, ఇంటి సామాగ్రీ పాడు కావడం, ఇలా ఎన్నో చూశామన్నారు. సీఎం కేసీఆర్ చలించిపోయి..వెంటనే నష్టపోయిన వారికి రూ. 10 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.



రూ. 550 కోట్ల రూపాయలు మంజూరు చేసింది తమ ప్రభుత్వమన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు రూ. 475 కోట్ల రూపాయలు పైగా సీఎం రిలీఫ్ రూపంలో ఇచ్చామన్నారు. దసరా, దీపావళి పండుగలు బాగు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో..ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు. అయితే…పొలిటికల్ గా రాద్ధాంతం చేసే వారు ఉంటారని, వీటిని పట్టించుకోమన్నారు.



జెన్యూన్ గా ఉండి..ఇంతవరకు సహాయం అందని వారిని ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. ఇంతవరకు సహాయం అందని వారు ఉంటే..వెంటనే మీ సేవా సెంటర్ కు వచ్చి..అప్లికేషన్ ఫాం నింపాల్సి ఉంటుందన్నారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్థిక సహాయం అందిస్తారని వెల్లడించారు. బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తే బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్.