మూడు గంటల వాన ముషీరాబాద్ లో ఒకరు మృతి, చెరువులను తలపించిన రోడ్లు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 06:33 AM IST
మూడు గంటల వాన ముషీరాబాద్ లో ఒకరు మృతి, చెరువులను తలపించిన రోడ్లు

Three hours rain in hyderabad : మూడు గంటల వాన హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడటంతో… కాలనీలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రోడ్లపైకి వచ్చిన జనం ఇటు.. అటు కదల్లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.



ఇక లోతట్టు ప్రాంతాలైతే వర్షపునీరుతో నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నానా ఇక్కట్లు పడ్డారు. ఇంకోవైపు డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీనితంటికి తోడు వాహనాలు కదిలే మార్గం లేక పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.



హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. వర్షాలతో ముషీరాబాద్‌లో హైకోర్టు ఉద్యోగి మృతిచెందాడు. ముషీరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వర్షపు నీరు చేరడంతో.. సెల్లర్‌లో చిక్కుకొని ఉద్యోగి రాజు మృతిచెందాడు. షార్ట్‌ సర్క్యూట్‌తో రాజు చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, కూకట్‌పల్లి, ముషీరాబాద్, గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, పురానాపూల్‌లో భారీ వర్షం కురిసింది. ఉద్యోగస్తులు డ్యూటీలు దిగి ఇంటికెళ్లి సమయం కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.



భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది. ఏకదాటిగా కురిసిన వర్షంతో.. కాలనీలు నీట మునిగాయి. భారీ ఎత్తున పిడుగుల శబ్దాలు హడలెత్తించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో చీకట్లోనే పలు కాలనీలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.



పాతబస్తీలోని బహదూర్‌పురా, చార్మినార్, యకుత్పురా, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కాలపత్తర్ రోడ్‌పై భారీగా నీరు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తూ పలు చోట్ల నీరు పోవడానికి దారి లేక రోడ్‌పై నీరు ఆగిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు నిలిచిపోవడంతో సోమాజిగూడ-రాజ్ భవన్ మార్గం బంద్ అయింది. గంట పాటు ట్రాఫిక్‌లో వాహనదారుల నరకయాతన పడ్డారు.



ఆసిఫ్‌నగర్ 13.2 సెం.మీ, విజయనగర్ కాలనీ 10.9 సెం.మీ, ఖైరతాబాద్ 10.5, బంజారా హిల్స్ 9.8, షేక్ పెట్ 9.5, టోలిచౌకి 9.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.