Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం

ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.

Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం

Tigers In Khammam District

Tigers Attack On Cows :  ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది. ఇక్కడి ఆదివాసి గ్రామాల ప్రజలు పులుల సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్ళవలసి వస్తోంది. అడవికి అతి సమీపంలో గిరిజన వలస ఆదివాసీలు నివాస గ్రామాలు ఉన్నాయి. ఎప్పుడు తమ గ్రామాలపై పులులు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటు ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు.

జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులుల సంచారంతో అప్రమతమైన ఫారెస్ట్ అధికారులు పులుల సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఎవరు అడవి ప్రాంతములోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసి…ఆదివాసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేసారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలో గల తిర్లపురం గోత్తికోయ గ్రామ సమీపంలోని తోట్టిగుట్ట అడవి ప్రాంతంలో ఇటీవల రెండు పులులు హఠత్తుగా పశువుల మందపై దాడి చేయడంతో పశువులు చెల్లాచెదురు కావడంతో భయాందోళనలకు గురైన పశువుల కాపరులు చెట్ల పైకి ఎక్కారు. రెండు పులులు ఆవు పై దాడి చేయడంతో అక్కడికక్కడే ఆవు మృతి చెందింది.

భయంతో చెట్టుపైనే ఉన్నా పశువుల కాపరులు సమీపంలో ఉన్న అమరారం గ్రామ సర్పంచ్ కి సమాచారం ఇవ్వగా, అతను ఫారెస్ట్ అధికారులకు తెలిపాడు. ఫారెస్ట్ అధికారులు ఆవుపై దాడి చేసిన ప్రదేశానికి చేరుకొని…. పరిశీలించి పులుల అడుగులను గుర్తించి రెండు పెద్ద పులులు దాడి చేశాయని నిర్ధారణకు వచ్చారు. ఆవుపై పులి దాడిచేసిన ప్రాంతంలో cc కెమెరాలు ఏర్పాటు చేసారు.

Also Read : Dummugudem Maoists Case : దుమ్ముగూడెం కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఎ

పినపాక కరకగూడెం మండలల్లోని చుట్టుపక్కల ఆదివాసి గ్రామాలు ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. గత రెండు రోజులుగా పులుల భయంతో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గుత్తికోయ గ్రామమైన తిర్లపురం అడవి ప్రాంతంలో పులులు ఆవుల మంద పై దాడి చేసి ఆవును చంపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

పినపాక రేంజర్ తేజశ్విని మాట్లాడుతూ…. అమరారం గ్రామపంచాయతీ పరిధిలో గల తిర్లపురం అటవీ ప్రాంతంలో రెండు పులులు ఆవులమందపై దాడిచేయడంతో ఒక ఆవు మృతి చెందిందని… చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరు కూడా అడివి ప్రాంతానికి వెళ్ళకూడదని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఎవరు కూడా పులులకు హాని తలపెట్ట రాదని ఆమె అన్నారు.