పోడు భూముల్లో పెద్ద పులులు.. కుట్ర అంటున్న గ్రామవాసులు!

పోడు భూముల్లో పెద్ద పులులు.. కుట్ర అంటున్న గ్రామవాసులు!

Tigers roaming around Villages : గ్రామాల్లోకి పులల సంచారం.. అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పోడు భూముల్లో పెద్ద పులులు తిరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పశువులు, మనుషులపై దాడి చేయడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, గిరిజనులు బిక్కుమంటూ ఇళ్లల్లోనే గడుపుతున్న పరిస్థితి. ఇటీవలే కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలో పులిదాడిలో ఇద్దరు మృతిచెందారు. అయితే ఇన్ని పులులు ఎక్కడినుంచి వచ్చాయనేది ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్​ గఢ్​నుంచి వలస వచ్చాయని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. కాదు.. వాళ్లే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమను పోడు భూముల్లో సాగు చేయకుండా కుట్రలు చేస్తున్నారంటూ వాపోతున్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజనులను పెద్దపులుల భయం పట్టుకుంది. 8 జిల్లాల్లో 15కు పైగా పులులు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్​ ఆఫీసర్లు గుర్తించారు. దాదాపు పది వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లాలోని కాగజ్​నగర్​ఫారెస్ట్​ డివిజన్‌లోనే ఉన్నాయని, మంచిర్యాల జిల్లా చెన్నూర్​డివిజన్‌లో రెండు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో మూడు, నాలుగు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్​ టైగర్​ రిజర్వ్​ఫారెస్ట్‌ల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోకి, చత్తీస్​గఢ్‌లోని ఇంద్రావతి టైగర్​రిజర్వు ఫారెస్టు నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోకి వలస వస్తున్నాయని ఆఫీసర్లు అంటున్నారు.

పులుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై అటవీ గ్రామాల వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్​ఆఫీసర్లే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అడవుల్లో వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ జిల్లాలో చాలా ఏళ్ల నుంచి పోడుభూముల సమస్యాత్మకంగా ఉంది. అటవీ సమీప గ్రామాల గిరిజనులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పట్టాలు ఇస్తామని మభ్యపెడుతోంది. ఆ భూములును స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్​ఆఫీసర్లు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోడు భూములను ఖాళీ చేయించాలన్న కుట్రతో ఇతర ప్రాంతాల నుంచి పులులను తీసుకొచ్చి వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.